పది రోజుల్లో మూడు సార్లా..?
చమురు ధరల పెంపుపై ‘మాస్ లైన్ ప్రజాపంథా’ నిరసన
తహసీల్దార్, ఎంపీడీఓలకు వినతి పత్రాల అందజేత
కాకతీయ, దుమ్ముగూడెం : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, గ్యాస్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తూ సామాన్యుడి నడుం విరుస్తోందని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ డివిజన్ నాయకుడు సాయన్న ధ్వజమెత్తారు. చమురు ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్బీఐ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ అశోక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ.. పది రోజుల వ్యవధిలోనే మూడు సార్లు చమురు ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. పెట్రో భారం వల్ల మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. జూన్ 2న ప్రభుత్వం ప్రకటించే ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన నిరుపేదలందరికీ పారదర్శకంగా పంపిణీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ, రాధ, అర్జున్, శ్రీరాములు, బాలరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

