రూ.4వేల కోట్ల అప్పుల్లో సింగరేణి
కాళేశ్వరాన్ని కూలగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర
కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చూస్తున్న ఆ పార్టీ లీడర్లు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘెర వైఫల్యం
మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
పాత కార్యకర్తలందరిని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం
పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు
కాకతీయ, మణుగూరు : తెలంగాణలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి రూ.4వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, సంస్థ అలా అప్పుల్లో కురుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం అని పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ రేగా కాంతారావు ఆరోపించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్ లో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వలస కాంగ్రెస్ నాయకులు, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో 39 రాష్ట్రాల్లో రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీ దిగజారి పోతుందని రేగా కాంతారావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలస నాయకులు వచ్చి.. మేమే అసలైన కాంగ్రెస్ నాయకులు అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వలస నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందని, వారంతా కంకణం కట్టుకున్న బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. అబద్ధాలు, మాయమాటలు చెప్తూ వీరందరూ నిజమైన కాంగ్రెస్ పార్టీని చంపేయాలని కుట్ర పన్నుతున్నారని తీవ్రంగా ఆరోపించారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర
కాలేశ్వరం ప్రాజెక్టును ఎలాగైనా కూలగొట్టాలనే దుర్మార్గుపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని రేగా కాంతారావు ఆరోపించారు. గతంలో కాలేశ్వరం కూలిందంటూ ఎంక్వయిరీ కొచ్చిన కమిషన్ ఏమైందని, ఆ కమీషన్ ఎటు పోయిందని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ప్రాజెక్టుని కూలగొట్టాలనే కుట్రతోనే అక్కడ యంత్రాల ద్వారా విచ్చలవిడిగా ఇసుకను తోడుతున్నారని, రాత్రి వేళల్లో జిల్టిక్స్ పెట్టి పేలుళ్లు జరుపుతున్నారని విమర్శలు కురిపించారు. అంతర్జాతీయంగా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా అపార పేరు ప్రతిష్టలు సంపాదించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కుట్రలు పన్నెందుకే ప్రాజెక్టు వద్ద ఈ ఇసుక తవ్వకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ పాత కార్యకర్తలకు ఆహ్వానం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని, ప్రజలు ఈ పాలనపై విసుగు చెందారని రేగా కాంతారావు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివిధ కారణాల వల్ల గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడిపోయిన పాత నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరిని మళ్ళీ సొంత గూటికి ఆహ్వానిస్తున్నానని మీడియా సాక్షిగా ప్రకటించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, యాదగిరి గౌడ్, తురక కోటి, రవి ప్రసాద్, రంజిత్, వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీను, నుకారపు రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

