8 క్వింటాళ్ల నల్ల బెల్లం, 100 కిలోల పటిక పట్టివేత!
ఎల్బీ తండాలో పోలీసుల ఆకస్మిక దాడులు.. నాటుసారా స్వాధీనం
కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని ఎల్.బి తండాలో ఎనిమిది క్వింటాల నల్లబెల్లం, వంద కిలోల పటికను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పెద్దవంగర ఎస్సై ప్రమోద్ కుమార్ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దవంగర మండలంలోని ఎల్.బి. తండా పరిధిలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించి, ఇదే గ్రామానికి చెందిన జాటోత్ రాజు అనే వ్యక్తి తన వ్యవసాయ బావి దగ్గర నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకొని గట్టిగా విచారించారు. అనంతరం అక్కడ తనిఖీలు చేయగా.. నాటుసారా తయారీ కోసం అక్రమంగా దాచి ఉంచిన (డంప్ చేసిన) 8 క్వింటాల నల్లబెల్లం, 100 కిలోల పటికతో పాటు 5 లీటర్ల నాటుసారా కూడా లభించాయి. దీంతో వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నల్లబెల్లం, పటిక విలువ మార్కెట్‌లో సుమారుగా రూ. 91 వేలు ఉంటుందని ఎస్సై తెలిపారు. నిందితుడు జాటోత్ రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్సై ప్రమోద్ కుమార్ వెంట పోలీస్ సిబ్బంది సుధాకర్, మహేందర్ ఉన్నారు.

