అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు
పేదోడి సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే వెంకట్రావు
కాకతీయ దుమ్ముగూడెం : అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తెలిపారు. సోమవారం మండలంలోని నరసాపురం, లచ్చిగూడెం, నారాయణరావుపేట గ్రామపంచాయతీల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని, ఇల్లు కట్టుకున్న లబ్ధిదారుల ఆనందం చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. నిరుపేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తెల్లం హరికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, జిల్లా కమిటీ సభ్యులు లంక అబ్బులు, పిలక వెంకటరమణారెడ్డి, పూజారి సూరి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మట్ట వెంకటేశ్వరరావు, సర్పంచులు రవివర్మ, నాగయ్య, ఆదినారాయణ, ధనలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

