రూ.19.18 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కాకతీయ,ఇల్లంతకుంట : ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పెద్ద భరోసాగా నిలుస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన 72 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.19,18,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర వైద్య చికిత్సల కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఇప్పటి వరకు 24 విడతల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయగా, తాజాగా 25వ విడతలో 72 మందికి రూ.19.18 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, ఎంపీడీవో శశికళ, తహసీల్దార్ సురేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె అయిలయ్య, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు పాల్గొన్నారు.

