కార్మికుల సొమ్ము ప్రచార ఆర్భాటాలకేనా..?
వెల్ఫేర్ ఫండ్ పేరుతో కోతలు.. ఆ సొమ్ము ఎక్కడ ఖర్చవుతోంది..?
ఆవిర్భావ వేడుకల్లో ఖాళీ కుర్చీలే దర్శనం… కార్మికుల ఆనందాలు ఎక్కడ..?
గత మూడేళ్లుగా ఒకే కమెడియన్‌కు ప్రాధాన్యం ఎందుకు..?
మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ తీవ్ర విమర్శలు
కాకతీయ, మణుగూరు : మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను అధికారులు తమ సొంత ప్రచార ఆర్భాటాలకే వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వేడుకల నిర్వహణపై మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆమె, పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చి వేడుకలు ఘనంగా జరిపినట్లు అధికారులు కలరింగ్ ఇచ్చారే తప్ప క్షేత్రస్థాయిలో కార్మికుల భాగస్వామ్యం ఎక్కడా కనిపించలేదన్నారు. “రాజుల సొమ్ము రత్నాల పాలు అన్నట్లు.. కార్మికుల కష్టార్జితాన్ని అధికారులు తమ సొంత పబ్లిసిటీకి వాడుకోవడం ఎంతవరకు సమంజసం?” అని ఆమె నిలదీశారు.
ఫొటోలకే పరిమితం.. ఖాళీ కుర్చీల ప్రదర్శన..!
సింగరేణిలోని ఇతర ఏరియాల్లో తెలంగాణ జ్వాల వెలిగించి, రన్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తే.. మణుగూరులో మాత్రం అలాంటివేమీ జరపకుండానే దొంగ ఫొటోలు తీసి ప్రచారానికి వాడుకున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. కార్యక్రమ ప్రాంగణంలో కార్మికులు లేక ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిచ్చాయని, కార్మికుల్లో ఎక్కడా ఆనందం కనిపించలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. భద్రాద్రి స్టేడియంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు గత మూడేళ్లుగా ఒకే జబర్దస్త్ కమెడియన్ లేదా యాంకర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఉన్న లోగుట్టు ఏమిటని దుర్గ ప్రశ్నించారు. ఈ ఆవిర్భావ వేడుకలు అధికారుల వ్యక్తిగత అభిరుచుల కోసమా, లేక కార్మికుల కోసమా అని మండిపడ్డారు. కవరేజ్‌కు వచ్చిన పాత్రికేయులకు కనీస గ్యాలరీ, సౌకర్యాలు కల్పించకుండా అవమానకరంగా వ్యవహరించడంపై మీడియా వర్గాల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నిధుల వినియోగంపై అనుమానాలు.. డీసీఎంకు ఫిర్యాదు!
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రూ.3.20 లక్షలతో పాటు కార్మికుల జీతాల నుంచి వెల్ఫేర్ ఫండ్ పేరుతో ప్రతి నెల లక్షల రూపాయలు కోత విధిస్తున్నారని, ఆ నిధులు నిజంగా కార్మికుల సంక్షేమానికే వినియోగిస్తున్నారా? లేక ఇలాంటి వృథా ఖర్చులకు మళ్లిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కొందరి వ్యక్తిగత ప్రచార వేదికగా మార్చడం సరికాదని, ప్రతి ఖర్చు వివరాలను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మణుగూరు సింగరేణి ఏరియాలో జరుగుతున్న ఈ నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై త్వరలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సింగరేణి సీఎండీ, డైరెక్టర్ పా, పర్సనల్ వెల్ఫేర్ జీఎంలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు పాల్వంచ దుర్గ స్పష్టం చేశారు.

