మత్తు విముక్త సమాజమే శ్రీరామరక్ష
డ్రగ్స్ బారిన పడితే జీవితాలు అర్థాంతరమే
మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరిష్
ఉప్పరగూడెం గ్రామసభలో ప్రత్యేక అవగాహన
కాకతీయ, పెద్దవంగర : “చదువుకునే వయస్సులో యువత చెడు వ్యసనాలకు బానిసలైతే తమ ఉజ్వల భవిష్యత్తును తామే నాశనం చేసుకున్నట్లవుతుంది. మత్తు పదార్థాలు ఆరోగ్యాలను నిర్వీర్యం చేస్తూ, ఎంతో మంది యువత జీవితాలను అర్ధాంతరంగా నిలిపివేస్తున్నాయి” అని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఉప్పరగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాదక ద్రవ్యాల నియంత్రణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజం డ్రగ్స్ రహితంగా మారాలంటే ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ప్రభుత్వ నిషేధిత మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత, తల్లిదండ్రులు పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులకే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులు వరి కొయ్యలను కాల్చకుండా భూసారాన్ని కాపాడుకోవాలని, మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకుని అత్యవసర సమయాల్లో పోలీసుల సాయం పొందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీడీవో వేణుమాధవ్, తహసీల్దార్ వినోద్, ఎంఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

