కేంద్రం ప్రభుత్వ విధానాలపై ప్రజాగ్రహం
పెంచిన ఇంధన ధరలు తగ్గించాల్సిందే
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా
కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి
ఉత్కంఠ రేపిన సీపీఐ నిరసన ప్రదర్శన
అడ్డుకున్న పోలీసులతో కార్యకర్తల వాగ్వాదం
తోపులాటతో ఉద్రిక్తంగా మారిన కలెక్టరేట్
కాకతీయ, కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా హెచ్చరించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై ప్రదర్శన నిర్వహించి, కార్యాలయం ముందు నేలపై పడుకొని తమ నిరసనను తెలిపారు. ఈ క్రమంలో ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కార్యకర్తలు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర తోపులాట జరిగింది.
సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో మాత్రం ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని సాబీర్ పాషా విమర్శించారు. ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఊడిగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి రేషన్ షాపుల ద్వారా అన్ని రకాల నిత్యావసర సరుకులను సబ్సిడీపై అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మార్కెట్లో నిత్యం సాగుతున్న బ్లాక్ మార్కెట్ ను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. సామాన్యులకు అందకుండా ధరలను పెంచడం ప్రజా వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, జిల్లా నాయకులు నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, సరెడ్డి పుల్లారెడ్డి, కె సారయ్య, మున్నా లక్ష్మి కుమారి, చండ్ర నరేంద్ర కుమార్, వి పూర్ణచందర్ రావు, జి వీరాస్వామి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, రేసు ఎల్లయ్య, మువ్వా వెంకటేశ్వర్ రావు, భూక్యా దస్రు, యు రాహుల్, ఎస్ కే ఫహీమ్ తో పాటు వివిధ మండలాల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

