సీతారామపురం నిధుల డ్రా సక్రమమే
తీర్మానాలు, ఎంబీలు, నోట్ ఫైల్స్ మేరకే నిధుల విడుదల
నిబంధనల ప్రకారమే బిల్లుల చెల్లింపు
అక్రమాల ఆరోపణలను ఖండించిన ఎంపీవో పద్మ
కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని సీతారామపురం గ్రామపంచాయతీలో సర్పంచి రూ. 4 లక్షల 17 వేల నిధులు డ్రా చేయడం పూర్తిగా నిబంధనల మేరకేనని ఎంపీవో బానోతు పద్మ స్పష్టం చేశారు. పనులు చేయకుండానే అక్రమంగా నిధులు డ్రా చేశారనే ఆరోపణలపై గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. సీతారామపురం గ్రామపంచాయతీలో స్ట్రీట్ లైట్లు, మట్టి రోడ్ల నిర్మాణం, రోడ్లపై మట్టి పోయడం వంటి పనులకు సంబంధించి గ్రామపంచాయతీ పాలకమండలి చేసిన తీర్మానాలు, రికార్డుల్లోని ఎంబీలు (మెజర్మెంట్ బుక్స్), నోట్ ఫైల్స్ ఆధారంగానే నిధుల విడుదలకు అనుమతించినట్లు ఎంపీవో తెలిపారు. నిధుల డ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆమె స్పష్టం చేశారు. పనులేవీ చేయకుండానే నిధులు విడుదల చేశారని వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని ఆమె కొట్టిపారేశారు.
పారదర్శకతతోనే బిల్లుల చెల్లింపు
గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త బొలగం చంద్రారెడ్డి నిధుల విడుదలపై వివరణ కోరగా, అన్ని పత్రాలను పరిశీలించామని ఎంపీవో వెల్లడించారు. మాజీ సర్పంచ్ గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రావలసి ఉందని తన దృష్టికి తెచ్చారని, పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్ సంతకాలు మరియు పూర్తి స్థాయి నోట్ ఫైల్స్ పరిశీలించిన తర్వాతే బిల్లులను ఆమోదించినట్లు తెలిపారు. రికార్డులన్నీ పక్కాగా ఉన్నాయని, తన దృష్టికి వచ్చినంత వరకు ఎటువంటి అక్రమాలు జరగలేదని ఎంపీవో పద్మ పునరుద్ఘాటించారు.

