ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు
మూడు వాహనాలు స్వాధీనం… వైరా పోలీసుల కేసు నమోదు
పునరావృత నేరస్తులపై హిస్టరీ, రౌడీ షీట్లకు సిద్ధం
అక్రమ ఇసుక వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు
కాకతీయ, వైరా/ ఖమ్మం బ్యూరో : అక్రమ ఇసుక రవాణా, విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక మాఫియాపై వైరా పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తెలంగాణకు తరలిస్తున్న ముఠాను శుక్రవారం పట్టుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. ఇసుక రవాణాకు వినియోగిస్తున్న లారీతో పాటు ఎస్కార్ట్ వాహనం, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. వైరా పోలీస్స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ రీచ్ నుంచి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, మైనింగ్ పర్మిట్లు, ట్రాన్స్పోర్ట్ చలానాలు, ఈ-వే బిల్లులు లేకుండా సుమారు 25 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
ముగ్గురి అరెస్టు
ఈ కేసులో ఖమ్మంకు చెందిన చల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు చల్లమల్ల సుమంత్కుమార్, లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్లను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ రవాణాకు వినియోగించిన అశోక్ లేలాండ్ లారీ, ఎస్కార్ట్ వాహనంగా ఉపయోగించిన మహీంద్రా థార్, విక్రయాల కోసం సిద్ధంగా ఉంచిన టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేసి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నేర చరిత్ర వెలుగులోకి
నిందితుల నేర చరిత్రను పరిశీలించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. చల్లమల్ల సుమంత్కుమార్పై ఇప్పటికే 12 క్రిమినల్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. వీటిలో పలు కేసుల్లో శిక్షలు కూడా పడినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే చల్లమల్ల వెంకటేశ్వరరావుపై ప్రస్తుతం నమోదైన కేసుతో కలిపి మొత్తం నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా అక్రమ ఇసుక రవాణా, దొంగతనం, మోసం వంటి నేరాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అలవాటుగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై హిస్టరీ షీట్లు ప్రారంభించడం, నిరంతర నిఘా ఏర్పాటు చేయడం, అవసరమైతే రౌడీ షీట్లు తెరవడం వంటి చర్యలు చేపడతామని వైరా పోలీసులు స్పష్టం చేశారు.

