చీపురు పట్టి… పైపుతో నీళ్లు కొట్టి
క్లాస్ రూంను అద్దంలా మార్చిన కేంద్ర మంత్రి
టెన్త్ విద్యార్థులకు మళ్లీ పరీక్ష ఫీజు, సైకిళ్లు అందిస్తాం
పాఠశాలలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
మోదీ 12 ఏళ్ల పాలనా స్పూర్తితో…‘‘స్వచ్ఛ పాఠశాల’’
సిరిసిల్ల పాఠశాల |శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
బండి సంజయ్ పిలుపుతో కదిలిన కార్యకర్తలు, టీచర్లు, విద్యార్ధులు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యకర్తగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ‘‘స్వచ్ఛ పాఠశాల’’ పేరుతో శుభ్రం చేసే పనికి శ్రీకారం చుట్టారు. తన పార్లమెంట్ పరిధిలోని ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలంతా కలిసి తమ తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేశారు. సొంతంగా చీపురు తెచ్చుకుని, క్లాత్, మగ్గు, బకెట్ తెచ్చుకుని తరగతి గదులను క్లీన్ చేశారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సందర్శించి, స్వయంగా తరగతి గదిలోని మూలమూలకు వెళ్లి చీపురు పట్టి ఊడ్చారు. పైపు నీళ్లతో తరగతి గదులతో పాటు చాలా ఆవరణను కూడా క్లీన్ చేశారు. ఆ తరువాత విద్యార్థులు కూర్చునే టేబుల్ కింద దుమ్ము ధూలి లేకుండా శుభ్రంగా తుడిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ
మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ వర్గాలను కలుస్తున్నామని, అనేక సభలు, సమ్మేళనాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘‘స్వచ్ఛ పాఠశాల’’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని పాఠశాలలను పరిశుభ్రం చేయాలని నిర్ణయించామని, రాజకీయాలకు అతీతీంగా మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని కోరారు. స్పూర్తిదాయకమైన సేవా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని, టీచర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొని తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారన్నారు. ఒక్కరోజు ముందే ఏ స్కూల్ ను ఎవరెవరు శుభ్రం చేయాలనే విషయంపై నిన్ననే ‘‘టిఫిన్ బైఠక్’’ నిర్వహించామన్నారు. పాఠశాలల్లో పిల్లలను చేర్చించాలని కోరుతూ సోమవారం గ్రామాలు, మండలాల వారీగా ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను అభివ్రుద్ధి చేయాలన్నది తన సంకల్పమని, అందులో భాగంగానే ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఈసారి కూడా సైకిళ్లు అందించబోతున్నామని, టెన్త్ విద్యార్థులందరికీ తన వేతనం నుండి పరీక్ష ఫీజు చెల్లిస్తానని ప్రకటించారు. పాఠశాల అభ్యున్నతి కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని, పాఠశాలలో నెలకొన్న సమస్యలపైనా త్వరలోనే సమీక్ష చేసి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

