సుపరిపాలనకు 12 వసంతాలు
ఖమ్మం అభివృద్ధికి కేంద్రమే అండ
ప్రపంచ పటంలో దేశాన్ని శిఖరాగ్రాన నిలిపిన ప్రధాని మోదీ
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు
ఖమ్మం జిల్లా అభివృద్ధికి వేల కోట్ల నిధుల మంజూరు
కాకతీయ, ఖమ్మం : గడచిన 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లుతోందని, ప్రపంచ దేశాల ముందు భారతదేశం అత్యంత గౌరవప్రదమైన స్థాయికి చేరుకుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ పదవీ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కిన్నెర రెస్టారెంట్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా, ఖమ్మం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను పారదర్శకంగా మంజూరు చేస్తోందని వాసుదేవరావు స్పష్టం చేశారు. సంక్షేమం మరియు మౌలిక వసతుల కల్పనలో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని గణాంకాలతో వివరించారు. సంక్షేమ పర్వం: జిల్లాలో మహిళా, శిశు సంక్షేమం కోసం సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ద్వారా 52 వేల మందికి పైగా లబ్ధి చేకూరింది. ఉజ్వల యోజన కింద 70 వేలకు పైగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 111 కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశారు.
పీఎం కిసాన్ కింద 1.43 లక్షల మంది రైతులకు రూ. 57 కోట్లు నేరుగా బదిలీ చేశారు. ఆయిల్ పామ్ సాగులో 9 వేల ఎకరాలకుపైగా తోటల పెంపకాన్ని ప్రోత్సహించారు. ఖమ్మంలో రూ. 23 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. పీఎం శ్రీ స్కూల్స్ కింద 28 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు.
కోదాడ-ఖమ్మం, సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారుల పనులు వంద శాతం పూర్తయ్యాయి. వరంగల్-ఖమ్మం-విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం వేగంగా జరుగుతోంది. రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో పాటు, బీఎస్ఎన్ఎల్ ద్వారా 175 హై-స్పీడ్ 4జీ టవర్లను ఏర్పాటు చేశారు. అభివృద్ధికి మారుపేరుగా మారిన మోదీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వాకధాని పుల్లారావు యాదవ్, నంబూరి రామలింగేశ్వర రావు, రుద్ర ప్రదీప్, గోంగూర వెంకటేశ్వర్లు, గుత్తా వెంకటేశ్వరరావు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

