వీరాపురం ఇసుక క్వారీ వివాదం
ఆదివాసీల హక్కుల జోలికొస్తే సహించం!
వర్క్ ఆర్డర్ లేకుండానే కోట్ల విలువైన ఖనిజ సంపద దోపిడీ
వాల్టా, పెసా చట్టాలను తుంగలో తొక్కారు
20 రోజులుగా శాంతియుత పోరాటం చేస్తున్నా అధికారుల్లో నిర్లక్ష్యం
తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లెం కోటి
కాకతీయ,పినపాక : పినపాక మండలం వీరాపురం ఆదివాసీ ఇసుక సొసైటీల మధ్య రీసింగ్ కాంట్రాక్టుల పేరుతో కొందరు కావాలనే కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లెం కోటి తీవ్రంగా ఆరోపించారు. గత 20 రోజులుగా ఈ సమస్య పరిష్కారం కోసం తాము శాంతియుతంగా, న్యాయపరంగా పోరాటం చేస్తున్నప్పటికీ స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. గురువారం పినపాకలో జరిగిన తుడుం దెబ్బ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎటువంటి అధికారిక వర్క్ ఆర్డర్ లేకుండానే ఏజెన్సీ పరిధిలోని ఇసుక, ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తూ, ప్రకృతికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల రక్షణ కోసం ఉన్న వాల్టా చట్టం, పెసా చట్టం మరియు మైనింగ్ నిబంధనలను కాంట్రాక్టర్లు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని అల్లెం కోటి ధ్వజమెత్తారు. అధికారుల అండదండలతోనే కోట్ల రూపాయల విలువైన ఇసుక సంపదను దోచుకోవాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ‘జల్-జంగిల్-జమీన్’ కోసం ప్రాణాలర్పించిన పోరాటాల గడ్డపై పుట్టిన ఆదివాసీలు.. నేడు తమ హక్కులను కాపాడుకునే పూర్తి చైతన్యంతో ఉన్నారని, కాంట్రాక్టర్ల అక్రమ దోపిడీ కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు.
హక్కులు సాధించే వరకు ఉద్యమం ఆగదు
భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఇందుకోసం ఎంతటి న్యాయపరమైన పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆదివాసీల హక్కులను సాధించుకునే వరకు తమ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుని వీరాపురం ఇసుక సొసైటీల వివాదంపై క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని, అక్రమ రవాణాను అడ్డుకుని గిరిజనులకు న్యాయం చేయాలని తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు.

