ఆగస్టులోనే టన్నెల్ పూర్తి చేయాలి
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్లో కీలక పనులపై నిర్లక్ష్యం వద్దు
బేతుపల్లి చెరువుకు గోదావరి జలాలు చేరాలి
ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటి సరఫరా
ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
టన్నెల్ లోపలికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించిన ఇరు జిల్లాల కలెక్టర్లు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యంత కీలక భాగమైన యాతాలకుంట టన్నెల్ నిర్మాణం, లైనింగ్ పనులను ఆగస్టు మొదటివారం నాటికి వంద శాతం పూర్తిచేసి గోదావరి జలాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం సత్తుపల్లి మండల పరిధిలో నిర్మాణంలో ఉన్న యాతాలకుంట టన్నెల్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఇద్దరూ టన్నెల్ లోపలికి నడుచుకుంటూ వెళ్లి పనుల పురోగతి, లైనింగ్ నిర్మాణం, భద్రతా ప్రమాణాలు మరియు నాణ్యత నియంత్రణ చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించి పనుల వేగంపై ఆరా తీశారు.
లక్ష ఎకరాలకు సాగునీటి భరోసా
ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.. యాతాలకుంట టన్నెల్ పనులను ఆగస్టు మొదటివారం నాటికి పూర్తి చేసేలా పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ టన్నెల్ పూర్తి కావడం ద్వారా సత్తుపల్లి ట్రంక్ కాలువకు గోదావరి జలాలు చేరి, సత్తుపల్లి నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. టన్నెల్ పూర్తయిన వెంటనే రుద్రాక్షపల్లి, బేతుపల్లి ప్రాంతాలతో పాటు ఎన్టీఆర్ ప్రధాన కాలువకు నీటి సరఫరా ఎంతో సులభతరం అవుతుందన్నారు. రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను వైరా ప్రాజెక్టుకు తరలించి ఆయకట్టు రైతులకు నీటి కొరత లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ టన్నెల్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదనంగా సుమారు లక్ష ఎకరాలకు సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అదనపు యంత్రాలతో యుద్ధప్రాతిపదికన పనులు
టన్నెల్ పనుల కోసం ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని, అయితే గడువు సమీపిస్తున్నందున మరింత వేగంపెంచి మిగిలిన లైనింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం రెండు వైపులా అదనపు యంత్రాలు, సిబ్బందిని (షిఫ్టుల వారీగా) వినియోగించాలన్నారు. పనుల అమలులో ఎలాంటి సాంకేతిక, పరిపాలనా సమస్యలు ఎదురైనా తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, నిర్ణీత గడువు దాటడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలానికే గోదావరి జలాలు బేతుపల్లి చెరువు, సత్తుపల్లి ఆయకట్టు ప్రాంతాలకు చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

నాణ్యతలో రాజీ పడొద్దు : కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. పనులను మరింత వేగవంతం చేసి ఆగస్టు లోపల పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరాదని, నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలు, ఇంజినీరింగ్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాలన్నారు. టన్నెల్ నిర్మాణ సమయంలో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పనుల ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ టన్నెల్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరిక్షిత్ మెహ్రా, చీఫ్ ఇంజనీర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. కృష్ణ, ఇంజినీరింగ్ సిబ్బంది, నిర్మాణ సంస్థ ప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


