వరదలను సమర్థంగా ఎదుర్కోవాలి
అనుభవాలతో అప్రమత్తంగా ఉండాలి
పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాను సుందరంగా తీర్చిదిద్దాలి
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
గోదావరి వరద సన్నద్ధతపై భద్రాద్రి జిల్లా అధికారులతో సమీక్ష
భద్రాచలం కరకట్ట పనులపై అధికారులపై మంత్రి ఆగ్రహం
కాకతీయ, కొత్తగూడెం : గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం కొత్తగూడెంలోని ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, రామదాసు నాయక్‌లతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఎలినోవో ప్రభావంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. “గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాణనష్టం జరగకుండా చూడాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు ముందస్తుగా మందులను సిద్ధం చేసుకోవాలి” అని ఆదేశించారు. భద్రాచలం పట్టణంలోకి వరద నీరు చేరకుండా పంపింగ్ మోటార్లను సిద్ధం ఉంచాలని ఇరిగేషన్ శాఖకు సూచించారు.


ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలు
వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లాలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధి పనులు, పుష్కరాల ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. భద్రాచలం-కూనవరం రహదారిపై చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు మూడు సంవత్సరాలుగా పూర్తికాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని గట్టిగా ఆదేశించారు. అలాగే, సారపాక జాతీయ రహదారిపై ఐటీసీ ఈస్ట్ గేట్ సమీపంలో వరద సమయంలో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నందున, ఆ రహదారి ఎత్తును పెంచేందుకు తక్షణమే ప్రణాళికలు సిద్ధం చేయాలని జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు.
రైతులకు ప్రభుత్వం అండ
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు, శాస్త్రీయ ఎరువుల వినియోగంపై గిరిజన రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, వరదల నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌తో పాటు, ప్రతి మండలంలోనూ మండల ఎమర్జెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని, అధికారులు ఇచ్చే సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శేష్ట, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

