డీసిల్టేషన్ పేరుతో అక్రమ ఇసుక దందా
ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఇసుక వేటలో మంత్రులు, ఎమ్మెల్యేలు
లైసెన్సులు లేని డ్రైవర్లతో లారీలు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం
వారం రోజుల్లో ముగ్గురు యువకులు మృతి
త్వరలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపులపై ఆందోళనలు
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
కాకతీయ, మణుగూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డీసిల్టేషన్ (పూడికతీత) పేరుతో భారీ అక్రమ ఇసుక దందాకు తెరలేపిందని, ఏకంగా గోదావరి నదినే ఊడ్చేస్తూ లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కేవలం ఇసుక అక్రమ సంపాదనపైనే శ్రద్ధ పెట్టారని మండిపడ్డారు. పట్టా ల్యాండ్స్ పేరుతో లోడింగ్ చేస్తూ ఏకంగా గోదావరి నది లోపలి నుంచే భారీ మిషనరీలను ఉపయోగించి అక్రమంగా ఇసుక తోలకాలు సాగిస్తున్నారని రేగా కాంతారావు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సొసైటీల ముసుగులో రేజింగ్ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ఈ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. దీనికి సంబంధించిన క్వారీ లొకేషన్లు, గూగుల్ మ్యాప్స్ ఆధారాలన్నీ తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. స్థానిక అధికారులు సైతం కాంట్రాక్టర్ల నీడలోనే బతుకుతూ దొంగలకు పూర్తిగా సహకరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఇసుక లారీల బీభత్సం.. అధికారుల నిర్లక్ష్యం
మణుగూరు ప్రాంతంలో ఇసుక లారీల మితిమీరిన వేగం, నిర్లక్ష్యం వల్ల వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు పచ్చని యువకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ ఇసుక లారీలు నడుపుతున్న డ్రైవర్లకు లైసెన్సులు ఉన్నాయా.. లేవా? అనే కనీస నిబంధనలను కూడా రవాణా, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. లైసెన్స్ లేని అనామక డ్రైవర్లతో లారీలు నడిపిస్తూ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులను పొట్టనబెట్టుకుంటున్నారని, దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఇసుక ర్యాంపులపై బీఆర్ఎస్ పోరాటం
ఈ అక్రమ ఇసుక దందాలపై ప్రజల నుంచి తిరుగుబాటు రావాలని, ప్రజలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే మణుగూరు, పినపాక నియోజకవర్గాల పరిధిలోని ఇసుక ర్యాంపులపై బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారులపై భవిష్యత్తులో ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పటికైనా అధికారులు బరితెగించి వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రేగా కాంతారావు హెచ్చరించారు.

