సీఎం సభకు వరుణుడు ఆటంకం
జులై మొదటి వారానికి రేవంత్రెడ్డి పర్యటన వాయిదా?
చింతకాని మండల వ్యాప్తంగా భారీ వర్షాలు
బురదమయంగా జగన్నాథపురం ‘రైతు ఆశీర్వాద సభ’ ప్రాంగణం
వర్షం కారణంగా నిలిచిపోయిన వ్యవసాయ స్టాళ్ల ప్రదర్శన
కాకతీయ, చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన ‘రైతు ఆశీర్వాద సభ’కు వరుణుడు ఆటంకంగా మారాడు. గత రెండు రోజులుగా మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగానే ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన వ్యవసాయ స్టాళ్ల ప్రదర్శన (ఎగ్జిబిషన్) సైతం నిలిచిపోయింది. వర్షం పడుతున్నప్పటికీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు సభకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరంగానే సాగించారు. అయితే ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా సభా ప్రాంగణం అంతా వర్షపు నీరు చేరి పూర్తిగా బురదమయంగా మారింది. హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ స్థలాలతో పాటు ప్రధాన మైదానంలోకి నీరు వచ్చి చేరడంతో ఏర్పాట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసి, జులై మొదటి వారంలో సభను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

