నీటి నిల్వపై నిర్లక్ష్యం ఇసుక దోపిడీకేనా?
బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయని ప్రభుత్వం
రైతుల ప్రయోజనాల కంటే ఇసుకకే ప్రాధాన్యత
ఏడాది దాటినా మేడిగడ్డ మరమ్మతులకు నోచుకోలేదు
సీతమ్మసాగర్ డిసీల్టేషన్ పేరుతో భారీగా అక్రమాలు
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లారీల రాకపోకలు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు
త్వరలోనే నిరసన పోరాటాలకు శ్రీకారం చుడుతామంటూ ప్రకటన
కాకతీయ,ఏటూరునాగారం : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ సుందిళ్ల మరియు కన్నెపల్లి బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు ఆరోపించారు. సోమవారం ఏటూరునాగారంలోని తన నివాసంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కన్నెపల్లి వద్ద 1 లక్ష క్యూసెక్కుల నీటిని వృథాగా వదులుతున్న ప్రభుత్వం రైతుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లకు మరమ్మతులు చేపట్టాలని జాతీయ భద్రతా కమిటీ 1 ఏడాదిన్నర క్రితమే సూచించినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి సీతక్కలకు కనీసం మరమ్మతులు చేసేందుకు అవసరమైన సిమెంట్, కంకర కూడా దొరకడం లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నిర్లక్ష్యం వల్ల వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక దోపిడీయే ప్రభుత్వ లక్ష్యం
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదని నీరు నిల్వ చేస్తే ఇసుక తవ్వకాలు సాధ్యం కావని భావించి ఇసుకకే పెద్దపీట వేస్తోందని కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఇసుక తవ్వకాలకు మార్గం సుగమం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి కేటీఆర్ భగీరథ ప్రయత్నంతో నిర్మించారని అలాంటి ప్రాజెక్టును మంత్రి సీతక్క విమర్శించడం బాధాకరమని అన్నారు. కేటీఆర్ కాళేశ్వరం పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని అయినప్పటికీ ఆయన బ్యారేజీలను సందర్శించి అక్కడి పరిస్థితులను రైతులకు మరియు ప్రజలకు వివరించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు పూర్తి అవగాహన లేకుండానే వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రెస్‌మీట్లు పెట్టినంత మాత్రాన వాస్తవాలు మారవని ఆయన పేర్కొన్నారు.
డీసిల్టేషన్ పేరుతో భారీ అక్రమాలు
సీతమ్మసాగర్ బ్యాక్‌వాటర్‌లో డిసీల్టేషన్ పేరుతో భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు తెలిపారు. ఒక జిల్లాలో 2 లక్షల క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతి ఇస్తే ములుగు జిల్లాలో 4 కోట్ల క్యూబిక్ మీటర్లకు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. డిసీల్టేషన్‌పై ఆరోపణలు వస్తున్నప్పటికీ మంత్రి పొంగులేటి మరియు మంత్రి సీతక్కల ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం లేదని విమర్శించారు. మంగపేట మండలం కత్తిగూడెం వద్ద 1,500 ఎకరాలకు నీరందించే శివగంగా ప్రాజెక్టును నిర్మించకుండా సీతమ్మసాగర్ పేరుతో ఇసుక తవ్వకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఇసుక లారీల రాకపోకలు ఉండకూడదని అయినప్పటికీ రాత్రింబవళ్లు రవాణా సాగుతోందని ఆయన మండిపడ్డారు. ఇసుక లారీల కారణంగా తమ ఉద్యమకారుడు రామకృష్ణ ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. డిసీల్టేషన్ పేరుతో జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకునేందుకు రైతులతో కలిసి త్వరలో పాదయాత్ర చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో తాటీ కృష్ణ తుమ్మ మల్లారెడ్డి వలిబాబా కాకులమర్రి ప్రదీప్‌రావు కునూరు అశోక్ గౌడ్ కొమరం ధనలక్ష్మి బాడిశ నాగరమేష్ సిద్ధంశెట్టి లక్ష్మణరావు ఎండీ కుర్బాన్ అలీ తాడూరి రఘు మరియు పప్పు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

