మంత్రి అండతోనే పైడాకుల ఆగడాలు
డీసీసీ అధ్యక్షుడు అశోక్‌కు రక్షణ కవచంగా మంత్రి సీతక్క
రూ.38 లక్షలు తీసుకుని ఇసుక కాంట్రాక్టర్‌కు వేధింపులు
మంత్రి సీతక్క అనుచరుల పేరుతో ములుగు జిల్లాలో అరాచకాలు
భాస్కర్ రావుకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి
బీజేపీ కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షుడు డా. జాడి రామరాజు నేత
కాకతీయ, వరంగల్ బ్యూరో : మంత్రి సీతక్క అండతోనే ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల ఆగడాలు పెరిగిపోతున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షుడు డా. జాడి రామరాజు నేత ధ్వజమెత్తారు. మంత్రి అనుచరులుగా చెలామణి అవుతున్న కొంతమంది లీడర్లు అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో డా. జాడి రామరాజు నేత విలేకరులతో మాట్లాడుతూ ఇసుక క్వారీ ఇప్పిస్తానని చెప్పి సబ్ కాంట్రాక్టర్ భాస్కర్ రావు వద్ద నుంచి రూ. 38 లక్షలు తీసుకుని మోసం చేసిన మాట వాస్తవమని అన్నారు. ప్రస్తుతం అతన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అశోక్ చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మంత్రి సీతక్క రక్షణగా ఉండటం సరైంది కాదని అన్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక మాఫియాపై మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన సీతక్క, ఇప్పుడు అదే మాఫియాకు కొమ్ముకాస్తూ ఆర్థిక ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు.ఇసుక సబ్ కాంట్రాక్టర్ భాస్కర్ రావు నుంచి తీసుకున్న రూ. 38 లక్షలను డీసీసీ అధ్యక్షుడు అశోక్ వెంటనే తిరిగి ఇచ్చేలా చూడాలని, బాధితుడికి తగిన రక్షణ కల్పించాలని డా. జాడి రామరాజు నేత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఇటువంటి అక్రమ, అరాచక పాలనపై స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రామరాజు హెచ్చరించారు.
రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం..!
జిల్లాలో 84,674 మంది రైతులు ఉండగా, కేవలం 62,544 మందికే రైతుబంధు అందిందని, మిగిలిన 22,400 మంది రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతుల డబ్బులు చెల్లించకుండా, ప్రజల చేత తనకే పాలాభిషేకం చేయించుకుంటూ మంత్రి “రాక్షసానందం” పొందుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ. 15,000 ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ. 12,000 ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే మంత్రి తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. 2024 మార్చిలో కొండాయి బ్రిడ్జికి శంకుస్థాపన చేసినా, ఇప్పటివరకు అది పూర్తి కాలేదని గుర్తు చేశారు. ఇసుక మాఫియా అక్రమాలను కప్పిపుచ్చడానికే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డివిజన్‌ను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.

