సింగరేణి అధికారుల ఆందోళనలు తీవ్రతరం
తొమ్మిదో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
కోల్ ఇండియా తరహాలో పే అప్గ్రేడేషన్ అమలు చేయాలి
రెండేళ్లుగా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే విడుదల చేయాలి
ప్రభుత్వం, యాజమాన్యం తీరుపై అధికారుల తీవ్ర అసహనం
సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక
కాకతీయ, మణుగూరు : కోల్ ఇండియాలో అమలవుతున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణి అధికారులకు కూడా తక్షణమే అమలు చేయాలని, అలాగే గత రెండు సంవత్సరాలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. గత రెండు సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యాన్ని, తెలంగాణ ప్రభుత్వ సంబంధిత అధికారులను, మంత్రులను పలుమార్లు ప్రత్యక్షంగా కలిసి తమ న్యాయమైన డిమాండ్లను అధికారులు వినిపించారు. కోల్ ఇండియాలో అధికారులకు పే అప్గ్రేడేషన్ అమలు చేసి, గత రెండు సంవత్సరాల పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేను కూడా చెల్లించినప్పటికీ, సింగరేణి అధికారులకు మాత్రం ఇప్పటి వరకు ఈ రెండు అంశాల్లో ఎలాంటి న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనంలో అంతర్భాగమైన పీఆర్పీని ఆలస్యం చేయడం వల్ల అధికారులు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో గత తొమ్మిది రోజులుగా సింగరేణిలోని అన్ని ఏరియాలలో అధికారులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ, యాజమాన్యం గానీ, తెలంగాణ ప్రభుత్వ సంబంధిత మంత్రులు గానీ ఇప్పటి వరకు చర్చలకు కూడా ఆహ్వానించకపోవడం అత్యంత విచారకరమని తెలిపారు. అధికారుల న్యాయబద్ధమైన ఆందోళనలను ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరించారు. ఆ పరిస్థితికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం మరియు తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

