- మార్చి-2027 నాటికి పూర్తి చేయాలి
- జిల్లాలో పకడ్బందీగా చేపట్టే బాధ్యత అధికారులదే
- సర్వేయర్లకు ఎకరానికి రూ.60 పారితోషికం
- ఇందిరమ్మ ఇళ్లు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి వేగం
- జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో భూ రీ-సర్వే, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీపై దిశానిర్దేశం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని, ధరణి కాలంలో పెండింగ్లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తులు అధిక సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
రీ-సర్వేతోనే భూ సమస్యలకు పరిష్కారం
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50 తో పాటు రవాణా ఇతర ఖర్చుల కోసం రూ.10 చొప్పున మొత్తం రూ.60 చెల్లిస్తామని, ఈ చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. మార్చి-2027 నాటికి మూడు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, విధుల్లో చేరని సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు వారికి బీమా, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఒక సర్వే నంబరులో కొంత భూమి ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ, మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లు, యూనిఫాంల పంపిణీ
మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న 2బీహెచ్కే ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేయాలని, రెండవ విడతలో గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల యూనిఫాంల విషయానికి వస్తే, స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్ల ద్వారా కుట్టిస్తున్నామని, ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా కలెక్టర్లు, డీఆర్డీఏ, గురుకులాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్, సెర్ప్ సీఈవో దివ్య, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

