- హత్యా? ఆత్మహత్యా? అని అనుమానాలు
- హుజురాబాద్ పట్టణంలో కలకలం
కాకతీయ, కరీంనగర్ /హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఒక మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో బావిలో లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పట్టణంలోని ఎస్ఐసీ కార్యాలయం సమీపంలో ఉన్న ఒక ఇంటి బావిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిని స్థానికంగా నివసిస్తున్న సునీతగా పోలీసులు గుర్తించారు. ఆమె మెడకు తాడు బిగించి ఉన్న ఆనవాళ్లు ఉండటంతో, ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు ఆమెను చంపి బావిలో పడేసి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
ముమ్మరంగా దర్యాప్తు
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించిన అధికారులు, మృతురాలి కుటుంబ సభ్యులను, స్థానికులను విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని, అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని హుజురాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

