ప్రతి కుటుంబానికి అండగా ఉంటా
కౌన్సిలర్ దండి రంగారావు
అర్హులకు సంక్షేమ పథకాల ఫలాలు
కాకతీయ, ఖమ్మం రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరవేయడంలో సీపీఐ ముందుంటుందని 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు అన్నారు. మంగళవారం చైతన్యనగర్‌కు చెందిన రేపాల సత్యనారాయణకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన అరవై వేల రూపాయల చెక్కును ఆయన ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందేలా సీపీఐ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సహకారంతో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఫారసు మేరకు ఈ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. చెక్కు అందుకున్న లబ్ధిదారుడు రేపాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు మంత్రికి, సీపీఐ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు వెంపటి సురేందర్, చైతన్య నగర్ నివాసులు నాగేశ్వరరావు, బాబురావు, రంగారావు, రమేష్, రియాజ్, భార్గవ్, భద్రం పాల్గొన్నారు.

