కాకతీయ, చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వేచరేణి గ్రామానికి చెందిన విలేకరి తౌట పశుపతి ఇంటి ముందు మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. అమావాస్య సందర్భంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లుగా భావించే రీతిలో, ఇంటి గుమ్మం వద్ద గుడ్డు, పసుపు, కుంకుమ ఉంచి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఉదయం ఇంటి బయటకు వచ్చిన కుటుంబ సభ్యులు ఈ వస్తువులను చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉద్దేశపూర్వకంగానే తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా, నిందితులను గుర్తించి ఘటన వెనుక ఉన్న కారణాలను వెలికితీయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

