మల్లూరు క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ప్రతి భక్తుడు ఒక మొక్కను నాటి మొక్కు తీర్చుకోవాలి
రూ. 50 కోట్లతో రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశం
మంత్రి దనసరి అనసూయ సీతక్క
కాకతీయ, ఏటూరునాగారం: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు ఒక మొక్కను నాటి మొక్కు తీర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి గురువారం ఆలయాన్ని సందర్శించిన మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధి మాస్టర్‌ప్లాన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్ర చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను ప్రతిబింబించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రూ. 50 కోట్లతో రహదారి పనులను వేగవంతం చేయాలని, పుష్కరాల నాటికి ఉపదేవాలయాల అభివృద్ధిని పూర్తి చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో, డీఎఫ్‌వో వికాస్ మీనా తదితరులు పాల్గొన్నారు.

