అదనపు డబ్బులు వసూలు చేస్తే కాంట్రాక్టు రద్దు
సేవల్లో పారదర్శకత లేకపోతే కఠిన చర్యలు తప్పవు
భక్తుల నుంచి అధిక ధరల వసూళ్లపై ఈవో తనిఖీలు
కాకతీయ,వేములవాడ: భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టును రద్దు చేస్తామని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి స్పష్టం చేశారు. ఇటీవల కళ్యాణకట్టలో భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా క్షేత్రస్థాయికి చేరుకున్న ఈవో, తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో నేరుగా మాట్లాడి సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారా లేదా అనే అంశాలపై ఆరా తీశారు.
అదనపు వసూళ్లపై ప్రత్యేక నిఘా
తనిఖీల్లో భాగంగా కళ్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణుల వివరాలను వీడియో రికార్డింగ్ ద్వారా సేకరించిన ఈవో, వారికి వేతనాలు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు పలు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ప్రతి ఉద్యోగికి యూనిఫాం, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని, కార్మికులకు వేతనాలు ఆలస్యం కాకుండా చెల్లించాలని సూచించారు. టికెట్ ధర 50 రూపాయలు మాత్రమేనని, అంతకు మించి చెల్లించవద్దని తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలని, మైక్ ద్వారా నిరంతరం ప్రకటనలు చేయాలని ఆదేశించారు. కళ్యాణకట్ట మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని, నగదు వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఇద్దరు సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. ఎవరైనా అదనపు డబ్బులు వసూలు చేసినట్లు రుజువైతే సంబంధిత కాంట్రాక్టును రద్దు చేసి బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఆమె హెచ్చరించారు. భక్తులు అక్రమ వసూళ్లను గమనిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.

