రోడ్డు లేకపోయినా విధి నిర్వహణలో రాజీ లేదు
దుర్గమ మార్గంలో డోలీలో రోగిని మోసిన 108 సిబ్బంది
సమయస్ఫూర్తితో గిరిజన యువకుడి ప్రాణాలు కాపాడిన వైనం
ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలింపు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరోసారి బహిర్గతమయ్యాయి. గుర్రాలబావి గ్రామానికి చెందిన గోత్తికోయ గిరిజన యువకుడు మడకం అయితయ్య (18) తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితికి చేరుకోగా, 108 అంబులెన్స్ సిబ్బంది సాహసోపేతంగా స్పందించి అతని ప్రాణాలను కాపాడారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అయితయ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ శివలింగం ప్రసాద్ మరియు పైలట్ కోటి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో బురద మార్గంలో కాలినడకన వెళ్లి బాధితుడిని చేరుకున్నారు. గ్రామస్తుల సహాయంతో అతడిని డోలీపై మోసుకుంటూ ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చి అంబులెన్స్‌లోకి తరలించారు.
వైద్య సేవలు మరియు అభినందనలు
అంబులెన్స్‌లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా, బాధితుడికి రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోవడంతో పాటు తీవ్ర జ్వరం ఉన్నట్లు గుర్తించారు. ఈఆర్సీపీ వైద్యురాలు డాక్టర్ మౌనిక సూచనల మేరకు వెంటనే అత్యవసర చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న 108 సిబ్బంది సేవలను స్థానికులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. గుర్రాలబావి వంటి గ్రామాల్లో ఇప్పటికీ అత్యవసర స్థితిలో డోలీలనే నమ్ముకోవాల్సిన దుస్థితి ఉండటంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.


