ఏటూరునాగారం అభివృద్ధిని అడ్డుకుంటున్న మంత్రి
డివిజన్ ఆమోదంపై మంత్రి సీతక్క దాటవేత ధోరణి
ఏటూరునాగారం డివిజన్ ఏర్పాటుపై స్పష్టతివ్వాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సైతం వైఖరిని వెల్లడించాలి
బీజేపీ కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జాడి రామరాజు
డివిజన్ సాధన కోసం బీజేపీ మండల కేంద్రంలో ధర్నా
కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ఏటూరునాగారం మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని బీజేపీ మండల అధ్యక్షులు వినుకొల్ల చక్రవర్తి ఆధ్వర్యంలో బస్సు స్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జాడి రామరాజు మాట్లాడుతూ, నాటి ఎమ్మెల్యేగా ఉండి నేడు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ, దళిత, బహుజన, మైనార్టీ వర్గాల ప్రజలు అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే మంత్రి డివిజన్ ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 2023 అక్టోబర్ 7న అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పుడు సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అనుకూలమో, వ్యతిరేకమో ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు. ఒకవేళ డివిజన్ ఏర్పాటును అడ్డుకుంటే స్థానిక ఎన్నికల్లో ఆయా పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని, బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు భర్తపురం నరేష్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్దన్, లింగంపల్లి శ్రీనివాస్, గాడిచార్ల రాజశేఖర్, పలుక గంగ, దుర్గం దుర్గారావు, ఇర్సవడ్ల జగన్, ప్రేమలత, దుర్గం శ్రవణ్ కుమార్, కొండగొర్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

