కాంగ్రెస్ నేతపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండగులు
నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి దారుణం
50 శాతం కాలిన గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు
గతంలో జీవిత ఖైదు అనుభవించిన నిందితుడు
కాకతీయ, వరంగల్ సిటీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్‌పై శనివారం అర్ధరాత్రి దారుణ హత్యాయత్నం జరిగింది. ఎనుమాముల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అడుప మహేశ్‌ను దుండగులు నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. సుమారు 50 శాతం కాలిన గాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అడుప మహేశ్, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన జన్ను మధు, శనివారం రాత్రి కోటిలింగాల ఆలయ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి రావాలని అడుప మహేశ్‌ను పిలిచాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మద్యం సేవించి, పత్రి కుమార్ అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే వద్ద తన గురించి ఏమి చెప్పావని మహేశ్‌ను ప్రశ్నించాడు. సమాధానం చెప్పేలోపే మహేశ్ ఫోన్ లాక్కుని, దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతోనే ప్రాణాలు దక్కించుకోవడానికి మహేశ్ ఎన్టీఆర్ నగర్‌కు చేరుకోగా, స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. తనపై హత్యాయత్నం చేసిన పత్రి కుమార్, తనకు సహకరించిన వారిని గుర్తించాలని మహేశ్ పోలీసులను కోరారు. తనను, తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన వేడుకున్నారు.
గతంలో జీవిత ఖైదు అనుభవించిన నిందితుడు
ప్రధాన నిందితుడు పత్రి కుమార్ గతంలోనే ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడి, బెయిల్‌పై బయటకు వచ్చాడని అడుప మహేశ్ తెలిపారు. రాజకీయ కక్షల వల్లే పత్రి కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ కేసులో ప్రధాన నిందితుడు పత్రి కుమార్ కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపారు. ఇప్పటికే నేరంలో పాల్గొన్న జన్ను మధు, సంపత్ అనే వ్యక్తులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించిన పోలీసులు, నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఐ విశ్వేశ్వర్ వెల్లడించారు.

