భార్యను దూరం పెడుతూ.. సహోద్యోగితో సహవాసం
ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులకు భార్య ఫిర్యాదు
హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
నిందితుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో సంచలనం
కాకతీయ, వరంగల్ బ్యూరో: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకంపై ఆయన భార్య భాగ్యలక్ష్మి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు వివాహం కాలేదని నమ్మించి, తోటి ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, భార్య, ఇద్దరు పిల్లలను అన్యాయానికి గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు. పోలీసులకు మరియు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అధికారులకు ఫిర్యాదు చేసిన భాగ్యలక్ష్మి
భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, 2012లో వారికి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ, తన భర్త అదే మండలంలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయురాలితో సన్నిహితంగా ఉంటూ, తనకు పెళ్లి కాలేదని ఆమెను నమ్మించాడు. ఈ విషయాన్ని గ్రహించిన భాగ్యలక్ష్మి ప్రశ్నించగా, తనను వదిలించుకునేందుకు విడాకుల నోటీసులు పంపి కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే ఇదే కుటుంబ వివాదాల నేపథ్యంలో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఇటీవల కోర్టు ప్రాంగణంలో కూడా తనను బెదిరించాడని ఆమె అధికారులకు వివరించారు.
పోలీసు, విద్యాశాఖ విచారణ
భాగ్యలక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, జిల్లా గ్రీవెన్స్‌లో ఆమె ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని, బాధ్యుడైన ఉపాధ్యాయుడిని విధుల నుండి సస్పెండ్ చేయాలని ఆమె తన పిల్లలతో కలిసి ఆందోళన చేపట్టారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారం ఉపాధ్యాయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపింది.

