- పచ్చదనమే సింగరేణికి భవిష్యత్
- పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
- జియో-ట్యాగింగ్ ద్వారా మొక్కల సంరక్షణకు చర్యలు
- : జీఎం దుర్గం రామచందర్
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉందని, ప్రకృతి పచ్చదనమే సింగరేణి భవిష్యత్ అని మణుగూరు సింగరేణి ఏరియా జీఎం దుర్గం రామచందర్ అన్నారు. భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆదేశాలు మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయం సూచనల మేరకు మణుగూరు ఏరియాలోని మణుగూరు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో భారీ స్థాయిలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ మాట్లాడుతూ, భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించే లక్ష్యంతోనే ఈ మెగా ప్లాంటేషన్ చేపట్టినట్లు తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
10,000 మొక్కల పెంపకమే లక్ష్యం
ఈ కార్యక్రమంలో భాగంగా తొలివిడతగా 550 మొక్కలను నాటామని తెలిపారు. మణుగూరు ఏరియాకు కేటాయించిన 10,000 మొక్కలను ప్రాజెక్టు పరిధిలోని రిక్లెయిమ్డ్ మైన్ ప్రాంతాలు, ఓబీ డంపులు, రహదారి పక్కన మరియు ఇతర అనుకూల ప్రాంతాల్లో నాటనున్నట్లు వెల్లడించారు. నాటిన ప్రతి మొక్కకూ జియో-ట్యాగింగ్ చేసి, వాటికి నిరంతర సంరక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఏజీఎం డి. వెంకటరామారావు, ఆఫీసర్ ఏజీఎం (పర్సనల్) ఎస్. రమేష్, పీఏ-కేపీయూజీ వేణుమాధవ్, ఏరియా ఇంజినీర్ బి. మదన్ నాయక్, పీఏ-ఎంఎన్‌జీసీ ఈ. శ్రీనివాస్, మేనేజర్ ఎంఎన్‌జీసీ టి. శ్రీరంగ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఎంఎన్‌జీసీ సురేష్, ఎంఎన్‌జీసీ పర్యావరణ అధికారి కిషన్ రామ్, ఏరియా పర్యావరణ అధికారి జె. శ్రీనివాస్, ఏరియా ఎస్టేట్ అధికారి స్వప్న, ఏరియా ఫారెస్ట్ అధికారి బి. కల్యాణ్, సెక్యూరిటీ అధికారి కె. శ్రీనివాస్, సంక్షేమ అధికారి డి. నరేష్, గుర్తింపు ప్రతినిధ్య సంఘాల నాయకులు ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ పీ. రాంగోపాల్, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వి. కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.

