కలలను నెరవేర్చుకునే దిశగా విద్యార్థుల పయనం
ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ ఉన్నత విద్య దిశగా అడుగులు
క్రమశిక్షణతో చదువుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న చిన్నారులు
కాకతీయ, మయూరి సెంటర్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎస్పీ క్యాంపులో నిర్వహిస్తున్న మూడు వసతి గృహాల విద్యార్థులు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఈ విద్యార్థులు చదువుపై ఉన్న అంకితభావంతో ప్రతిరోజూ పాఠశాల నుండి ప్రభుత్వ హాస్టల్‌కు కాలినడకన వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం పాఠశాల వదిలిన వెంటనే భుజాలపై పుస్తకాల బ్యాగులతో లైన్‌గా హాస్టల్‌కు బయలుదేరిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ గ్రామాల నుండి చదువు కోసం ప్రభుత్వ వసతి గృహాలలో ఉంటున్న ఈ విద్యార్థులు, ఉన్నత చదువులు చదివి కుటుంబాలకు, సమాజానికి వెలుగు నింపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామనే ధీమాతో ఉన్నారు. ఇటీవల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు పెంచడంతో చదువుపై ఉన్న పట్టుదలతో విద్యార్థులు క్రమం తప్పకుండా ఇలా వస్తున్నారు.
వార్డెన్ల క్రమశిక్షణతో ప్రత్యేక శిక్షణ:ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు వార్డెన్లు ప్రతిరోజూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
పాఠశాల ముగిసిన వెంటనే కాలినడకన హాస్టల్‌కు చేరుకునే చిన్నారులకు చదువుతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారు.
“మీరు ఎవరికీ తీసిపోరు, కష్టపడితే ఉన్నత స్థాయికి వెళ్తారు” అంటూ ప్రతిరోజూ వారికి ధైర్యం నూరిపోస్తున్నారు.
హాస్టల్‌లో చదువు, శుభ్రత, సమయపాలన అలవాటు చేస్తూ, వార్డెన్ల మార్గదర్శకత్వంలో విద్యార్థులను ఉన్నత లక్ష్యాలతో ముందుకు నడిపిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రేపటి సమాజానికి మంచి పౌరులుగా ఎదుగుతారనే ఆశను నింపుతున్నారని, వార్డెన్ శిక్షణ, విద్యార్థుల కమిట్‌మెంట్ కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని స్థానికులు అభినందిస్తున్నారు.

