కరీంనగర్లో వరుస దోపిడీలు..!
వృద్ధ దంపతులను కట్టేసి రూ.21 లక్షలు, 66 తులాల బంగారం లూటీ
డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరింపులు
కుటుంబ సభ్యుల బందీ.. రెండు బైకులతో పరారైన దుండగులు
పీఎంజే జ్యువెలరీ చోరీ మరువకముందే మరో బీభత్సం
నగరంలో పెరుగుతున్న నేరాలపై ఆందోళన
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో శాంతిభద్రతలు మంటగలుస్తున్నాయి. పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ చోరీ కలకలం ఇంకా సద్దుమణగకముందే, నగరంలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. భగత్‌నగర్‌లో అర్ధరాత్రి అత్యంత దారుణంగా ఇంట్లోకి చొరబడిన ఎనిమిది మంది దుండగులు.. వృద్ధ దంపతులను బంధించి రూ.21 లక్షల నగదు, 66 తులాల బంగారం, 10 తులాల వెండిని దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి ముఖాలకు ముసుగులు ధరించిన ఎనిమిది మంది దుండగులు ప్రహరీ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. చేతుల్లో డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరిస్తూ వృద్ధ దంపతులతో పాటు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ గదిలో కట్టేశారు. ఎవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే నిశ్శబ్దంగా బీభత్సం సృష్టించారు. బీరువాలు, అల్మారాలను చిందవందరగా గాలిస్తూ వాటిలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. బాధితుల మెడలో ఉన్న గొలుసులు, చేతి ఉంగరాలను కూడా బలవంతంగా లాక్కున్నారు. దోచుకున్న సొత్తుతో పాటు ఇంటి బయట పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను సైతం ఎత్తుకెళ్లి దుండగులు పరారయ్యారు.

భయానక వాతావరణంలో నగరవాసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రలు, ఇతర భౌతిక ఆధారాలను సేకరించారు. చుట్టుపక్కల నివాసాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు.. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇటీవల పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ చోరీ కేసు విచారణ దశలో ఉండగానే, ఇప్పుడు ఏకంగా నివాస గృహంలోకి చొరబడి ఈ స్థాయిలో దోపిడీ జరగడం నగర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. వరుస ఘటనలతో కరీంనగర్లో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, రాత్రివేళల్లో పోలీసు గస్తీని మరింత పెంచి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

