హార్టికల్చర్ టెండర్లలో సివిల్ కాంట్రాక్టర్లకూ అవకాశం ఇవ్వాలి
జీఓ నంబర్-94 అమలు చేయాలని జీడబ్ల్యూఎంసీ అధికారులకు వినతి
ఎంపానెల్‌మెంట్ నిబంధనలతో చిన్న కాంట్రాక్టర్లకు అన్యాయమని ఆవేదన
సుమారు 300 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పించాలని డిమాండ్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న హార్టికల్చర్, గ్రీనరీ అభివృద్ధి పనుల టెండర్లలో సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ కలిగిన స్థానిక కాంట్రాక్టర్లకు కూడా అవకాశం కల్పించాలని సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్-94తో పాటు సంబంధిత నిబంధనలను అమలు చేసి టెండర్ షరతులను సవరించాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ ప్రతినిధులు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. హార్టికల్చర్ పనుల కేటాయింపులో ఐ అండ్ సీఏడీ శాఖ జీఓ ఎంఎస్ నంబర్-94 నిబంధనలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా టెండర్ నిబంధనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ ఎంపానెల్‌మెంట్‌తో స్థానికులకు నష్టం
ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ హార్టికల్చర్ టెండర్లలో జీహెచ్‌ఎంసీ బయోడైవర్సిటీ విభాగం ఎంపానెల్‌మెంట్‌ను తప్పనిసరి చేయడం వల్ల స్థానిక చిన్న కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ ఆరోపించింది. జీహెచ్‌ఎంసీ ఎంపానెల్‌మెంట్ హైదరాబాద్ పరిధికే పరిమితమని, అదే నిబంధనను వరంగల్‌లో అమలు చేయడం వల్ల కొద్దిమందికే పనులు దక్కుతున్నాయని పేర్కొంది. దీంతో కొత్తగా రంగంలోకి వచ్చిన కాంట్రాక్టర్లకు అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ ఉన్న వారికి వారి క్లాస్‌కు అనుగుణంగా నిర్దిష్ట విలువ వరకు పనులు చేపట్టే అర్హత ఉందని అసోసియేషన్ వివరించింది. జీఓ ఎంఎస్ నంబర్లు 94, 16, 66, 142 ప్రకారం రూ.5 లక్షల లోపు పనులకు అనుభవం లేకున్నా లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించే నిబంధన ఉందని గుర్తు చేసింది. అదే విధానాన్ని జీడబ్ల్యూఎంసీలో కూడా అమలు చేయాలని కోరింది.
300 మంది చిన్న కాంట్రాక్టర్లకు లాభం
కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలు, అటవీ, ప్రజారోగ్య, ట్రాన్స్‌కో శాఖల్లో హార్టికల్చర్ పనులను సివిల్ కాంట్రాక్టర్ల ద్వారానే చేపడుతున్నారని పేర్కొంది. అదే విధానాన్ని వరంగల్‌లో అమలు చేస్తే సుమారు 300 మంది స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది. వరంగల్‌లో విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటీ పార్క్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో గ్రీనరీ అభివృద్ధి పనుల్లో ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తే నగర అభివృద్ధికి తోడ్పడుతుందని అసోసియేషన్ అభిప్రాయపడింది. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పూజారి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు సుధాకర్, కమిటీ సభ్యులు రాజేందర్, సతీష్, ఎల్లయ్య, శీను, విక్రమ్, బిక్షపతి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

