ఏసీబీ వేట
అవినీతి అధికారుల ఆట..కట్
అక్రమార్కుల భరతం పడుతున్న అవినీతి నిరోధక శాఖ
చిన్న అధికారుల నుంచి ఉన్నతాధికారులపై నిఘా
అవినీతి అధికారుల చరిత్ర తెలుసుకుని సోదాలు
ఐఏఎస్, ఐపీఎస్‌ల అక్రమాస్తులపై ప్రత్యేక నిఘా
పక్కా సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు
బినామీ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు
అధికార యంత్రాంగంలో గుబులు రేపుతున్న ఏసీబీ దాడులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అవినీతి అధికారుల అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. క్షేత్రస్థాయి ఉద్యోగులతో మొదలైన దాడులు ఇప్పుడు ఉన్నతాధికారుల వరకు విస్తరించడంతో అధికార యంత్రాంగంలో కలకలం రేగుతోంది. అవినీతి అధికారుల గత చరిత్రను సైతం తవ్వి తీస్తూ, పక్కా సమాచారంతో వరుస సోదాలు నిర్వహిస్తుండటంతో అక్రమార్కుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అవినీతి నిరోధక శాఖ ఎవరినీ ఉపేక్షించకుండా చర్యలు చేపడుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ దాడులు వేగం పుంజుకున్నాయి. సాధారణ తనిఖీలకే పరిమితం కాకుండా, ముందస్తు సమాచారంతో ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ప్రభుత్వ వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతిని వెలికితీసేందుకు శాఖల వారీగా సమాచారం సేకరిస్తూ దర్యాప్తును విస్తరించింది. ఇప్పటివరకు ప్రధానంగా రెవెన్యూ, నీటిపారుదల, అటవీ, విద్యుత్, మున్సిపల్, పోలీస్ శాఖల్లో పనిచేస్తున్న అధికారులపైనే ఏసీబీ దృష్టి సారించింది. ఈ దాడుల్లో గ్రూప్-1, గ్రూప్-2 కేడర్ అధికారులే ఎక్కువగా చిక్కుకున్నారు. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయి అధికారులతో పాటు ఉన్నతస్థాయి అధికారుల అక్రమాలపై కూడా దర్యాప్తు ముమ్మరమైనట్లు తెలుస్తోంది.
ఇటీవల పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌కు చెందిన డీఎస్పీ సంగిరెడ్డి భీమిరెడ్డి అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాత కేసును తిరిగి తెరపైకి తీసుకొచ్చి ఆస్తులపై విచారణ జరపగా భారీ స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఒక డీఎస్పీ స్థాయి అధికారి వద్ద రూ.150 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించిన ఘటన అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఉన్నతాధికారులపై ఉచ్చు బిగుస్తోంది
విద్యుత్ శాఖకు చెందిన ఓ అసిస్టెంట్ ఇంజనీర్ వద్ద కూడా రూ.150 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులు బయటపడిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే వీరంతా కేవలం బినామీలేనని, అసలు సూత్రధారులు తెరవెనుక ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులు, బినామీ పెట్టుబడులపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. కొంతకాలంగా కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆస్తులపై కూడా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో వారి ఆస్తులపై ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులపై ఆధారాలు లభించిన తర్వాత తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం.
బినామీ ఆస్తులే లక్ష్యం
వ్యక్తిగత కేసులకే పరిమితం కాకుండా వ్యవస్థీకృత అవినీతిని లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతికి సహకరించిన అధికారులను గుర్తించడంతో పాటు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల మూలాలను వెలికితీసే పనిలో నిమగ్నమైంది. బినామీ లావాదేవీలు, పెట్టుబడులపై ప్రత్యేక బృందాలు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో బయటపడుతున్న వివరాల ఆధారంగా అక్రమ ఆస్తుల జప్తు ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కేవలం అరెస్టులతో కాకుండా అక్రమ సంపదను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అధికారుల్లో పెరుగుతున్న ఆందోళన
వరుస దాడులతో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఆందోళన నెలకొంది. గతంలో నిర్భయంగా వ్యవహరించిన కొందరు అధికారులు ఇప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లంచాలు, అక్రమ వసూళ్లపై ఏసీబీ దృష్టి మరింత పదునెక్కడంతో క్షేత్రస్థాయి ఉద్యోగులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అవినీతికి పాల్పడిన వారిపై ఎలాంటి రాజకీయ లేదా అధికార పరమైన ఒత్తిళ్లకు తావు లేకుండా చర్యలు కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర బ్యూరోక్రసీలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై చర్చ సాగుతోంది.
తదుపరి లక్ష్యం పెద్ద తలకాయలేనా?
ఇప్పటివరకు నమోదైన కేసులు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను సమీక్షిస్తున్న ఏసీబీ, ఉన్నతస్థాయి అధికారులపై మరిన్ని చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ శాఖల్లో కీలక పదవులు నిర్వహించిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆస్తులపై కూడా దర్యాప్తు ముమ్మరమైనట్లు సమాచారం. దీంతో రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలపై అధికార, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ కొనసాగుతోంది.

