- దొంగలు జైల్లో.. కొనుగోలుదారులు బయట..!
- దొంగతనాలకు యువకులను ప్రేరేపించిన వారిని వదిలేస్తారా..?
- 3000 కేజీల కాపర్ ఎక్కడ..? రికవరీ మాత్రం 300 కేజీలా..?
- సింగరేణి, బీటీపీఎస్ స్క్రాప్ కేసులో దర్యాప్తుపై అనుమానాలు
- మణుగూరులో తీగలాగితే..ఏటూరునాగారంలో కదులుతున్న డొంక
- అసమగ్రంగా ఏటూరునాగారం ఎస్సై మహేష్ వివరణ
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: రోజుకు కూలీ పనులు, ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే యువకులను దొంగతనాల వైపు మళ్లించి, వారి చేత కాపర్ వైర్లు చోరీ చేయిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్న ముఠా వెనుక అసలు సూత్రధారులు ఎవరనే ప్రశ్న ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. దొంగతనాలకు పాల్పడిన యువకులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపినా, వారి నుంచి వేల కేజీల కాపర్ కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారులపై మాత్రం కఠిన చర్యలు కనిపించకపోవడంతో దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగతనం చేసినవారు జైలులో ఉండగా, దొంగ సొత్తు కొనుగోలు చేసిన వారిపై ఎందుకు అదే స్థాయిలో చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీసులు ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్న యువకులను అరెస్టు చేశారు. దర్యాప్తులో మణుగూరులోని కొందరు స్క్రాప్ వ్యాపారులతో వారి లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మణుగూరుకు చెందిన ఇనుప వ్యాపారి సర్వేష్‌తో పాటు సుందరయ్య నగర్‌కు చెందిన నబి, హుస్సేన్ అనే వ్యాపారులు దొంగిలించిన కాపర్ వైర్లను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దొంగతనాలకు పాల్పడిన యువకులపై కఠిన సెక్షన్లు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు, కొనుగోలుదారులపై మాత్రం అదే తీవ్రతతో చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
3000 కేజీల కాపర్ ఎక్కడికి వెళ్లింది..?
జైలులో ఉన్న యువకులు తమ కుటుంబ సభ్యులకు చెప్పిన వివరాల ప్రకారం సర్వేష్‌కు సుమారు 2000 కేజీలు, నబికి 500 కేజీలు, హుస్సేన్‌కు మరో 500 కేజీల కాపర్ వైర్ విక్రయించినట్లు సమాచారం. అంటే మొత్తం 3000 కేజీలకు పైగా కాపర్ ఈ ముగ్గురు వ్యాపారుల వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు రికవరీ చేసినట్లు చెబుతున్నది 300 కేజీలకు పైగా మాత్రమే. మిగిలిన కాపర్ ఎక్కడికి వెళ్లింది? దానిని స్వాధీనం చేసుకున్నారా? ఇప్పటికే విక్రయించారా? అనే ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
దొంగతనాలకు ప్రోత్సహించింది ఎవరూ..?
దొంగతనాలకు పాల్పడిన యువకులు తాము స్వచ్ఛందంగా ఈ పనులు చేయలేదని, స్క్రాప్ వ్యాపారులే కాపర్ తెస్తే కొనుగోలు చేస్తామని చెప్పడంతోనే ఈ మార్గంలోకి వెళ్లామని తమ బంధువుల వద్ద చెప్పినట్లు సమాచారం. కొందరు యువకుల ఖాతాలకు వ్యాపారుల నుంచి ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ అయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ లావాదేవీల వివరాలు పోలీసుల దర్యాప్తులో ఉన్నాయా? వాటిని స్వాధీనం చేసుకున్నారా? అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. దొంగ సొత్తు కొనుగోలు చేయడం కూడా చట్టరీత్యా నేరమే అయినప్పటికీ, కొనుగోలుదారులపై అదే తీవ్రతతో చర్యలు కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్క్రాప్ దందా వెనుక పెద్ద నెట్వర్క్..?
ఈ వ్యవహారం కేవలం కాపర్ వైర్లకే పరిమితం కాదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సింగరేణి, బీటీపీఎస్ వంటి ప్రభుత్వరంగ సంస్థల నుంచి వచ్చే స్క్రాప్ కొనుగోళ్లలోనూ ఇదే వ్యాపారుల పాత్ర ఉందని స్థానికంగా ప్రచారం సాగుతోంది. అక్రమంగా వచ్చిన స్క్రాప్, కాపర్, ఇతర లోహాలను కొనుగోలు చేసి భారీ లాభాలు ఆర్జిస్తున్న నెట్వర్క్ పనిచేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరికొందరు మధ్యవర్తులు, ప్రభావశీలుల పాత్ర కూడా ఉందా అనే కోణంలో విచారణ జరగాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అక్రమ వ్యాపారాలకు అండగా నిలిచిన వారెవరైనా ఉంటే వారినీ గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఎస్సై ఏమంటున్నారు..?
ఈ వ్యవహారంపై ఏటూరునాగారం ఎస్సై మహేష్ స్పందించారు. దొంగతనాలకు పాల్పడిన యువకులపై మొత్తం 18 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 2 కేసుల్లో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం 7 గురిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. సుమారు 300 కేజీలకు పైగా కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో సమర్పించినట్లు తెలిపారు. నిందిత యువకులు ప్రస్తుతం జైలులో ఉన్నారని చెప్పారు. అయితే దొంగ సొత్తు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారులపై ఏయే సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నారన్న అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో మొత్తం వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది.

