- ప్రైవేట్ వ్యక్తుల చేతిలో భూభారతి రిజిస్ట్రేషన్లు..?
- ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లు?
- అడిగినంత ఇవ్వకపోతే ‘సర్వర్ పనిచేయడం లేదు’ అంటున్నారంటున్న రైతులు
- అధికారుల సాక్షిగానే వసూళ్ల దందా సాగుతోందని తీవ్ర ఆరోపణలు
కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే నిర్వహించాల్సిన భూభారతి రిజిస్ట్రేషన్లను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి కార్యాలయ వ్యవహారాలు నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన నుంచి భూభారతి పోర్టల్‌లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం వరకు ప్రైవేటు వ్యక్తులే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో రిజిస్ట్రేషన్ స్లాట్‌కు ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారని, అడిగినంత చెల్లించని వారి దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతున్నారనే ఫిర్యాదులు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ దందా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు… జిల్లా కేంద్రంలోని ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలోనే అధికారుల ఎదుటే సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ‘కాకతీయ’ ప్రత్యేక కథనం.
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో భూభారతి..!

గతంలో ధరణి పోర్టల్ అమలుపై అనేక విమర్శలు, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం పారదర్శకత లక్ష్యంగా భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ధరణి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యాయనే విమర్శల నేపథ్యంలోనే కొత్త విధానాన్ని అమలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో మాత్రం భూభారతి పోర్టల్ ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ నిర్వహించాల్సిన అధికారిక ఆపరేటర్ స్థానంలో ఓ ప్రైవేటు వ్యక్తి కూర్చొని భూభారతి పోర్టల్‌లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలోని కంప్యూటర్ వద్ద భూభారతి పోర్టల్‌ను ఆ వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతోందా? లేక వారి దృష్టికి రాకుండానే కొనసాగుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డిజిటల్ కీ లేకుండా ఎలా..?
భూభారతి పోర్టల్‌లోకి ప్రవేశించాలంటే సంబంధిత అధికారుల లాగిన్ వివరాలు, డిజిటల్ కీ అవసరం. అలాంటప్పుడు ఓ ప్రైవేటు వ్యక్తి పోర్టల్‌లోకి ఎలా ప్రవేశిస్తున్నాడు? ఎవరి అనుమతితో ఈ వ్యవహారం కొనసాగుతోంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించాల్సిన విధులను అనధికార వ్యక్తులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు నిజమైతే, అది అత్యంత తీవ్రమైన పరిపాలనా వైఫల్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మార్వో కార్యాలయంలో కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన మాన్యువల్ రికార్డులు, రిజిస్ట్రేషన్ ఫైళ్లు, రికార్డు రూమ్‌లోని కీలక పత్రాలు భద్రపరిచి ఉంటాయి. అలాంటి రికార్డులకు కూడా ప్రైవేటు వ్యక్తులు చేరువవుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. భూ రికార్డుల నకళ్లు అనధికారంగా బయటకు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కొందరు రైతుల నుంచి వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఒక్కో రేటా..?
భూముల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే రైతుల నుంచి ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఒక్కో మొత్తం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువను బట్టి రేట్లు నిర్ణయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అడిగినంత చెల్లించిన వారి పనులు వేగంగా పూర్తవుతుండగా, డబ్బులు ఇవ్వని వారికి “సర్వర్ పనిచేయడం లేదు”, “సిస్టమ్ స్పందించడం లేదు” అంటూ రోజులు తరబడి తిప్పుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారా జరిగే వసూళ్ల వ్యవహారం వెనుక కొందరు అధికారులు ఉన్నారనే ఆరోపణలు కూడా రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ద్వారా వచ్చిన డబ్బులు కొందరు అధికారులకు చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
వైరల్ వీడియోతో కలకలం
భూభారతి పోర్టల్‌ను ఓ ప్రైవేటు వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంపై తీవ్ర చర్చ మొదలైంది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగినా? కాంట్రాక్టు సిబ్బందా? లేక పూర్తిగా ప్రైవేటు వ్యక్తినా? అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చిన ప్రభుత్వ లక్ష్యం పారదర్శకతను పెంచడమే. అలాంటి వ్యవస్థ అమలులోనే ప్రైవేటు వ్యక్తుల జోక్యం, వసూళ్ల ఆరోపణలు వినిపించడం రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఉన్నత రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిగితేనే ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో, భూభారతి వ్యవస్థలో అనధికార జోక్యం ఎలా జరిగిందో తేలే అవకాశం ఉందని వారు అంటున్నారు.

