అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కాకతీయ, చేర్యాల : అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చేర్యాల మండలం కొత్త దొమ్మాట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శెట్టె రామస్వామి (38) చేర్యాల పెద్ద చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వ్యవసాయ అవసరాల కోసం ఆవుల షెడ్డు నిర్మాణం, బోర్లు వేయడం తదితర పనులకు రామస్వామి అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకినట్లు తెలిపారు. మంగళవారం పోలీసులు, స్థానిక యువకుల సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య శెట్టె లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామస్వామికి తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పటికే తండ్రి, సోదరుడిని కోల్పోయిన కుటుంబానికి ఆయనే పెద్దదిక్కుగా ఉండగా, ఇప్పుడు ఆయన మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

