కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం అందించాలి
విద్యార్థినులకు నిరంతర పర్యవేక్షణ.. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు
ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది : కలెక్టర్ కె. హైమావతి
కాకతీయ, చేర్యాల : మద్దూరు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బాలికల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడే వరకు నిరంతర పర్యవేక్షణతో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి వైద్యులను ఆదేశించారు. సోమవారం చేర్యాల పట్టణంలోని సామాజిక ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలికలతో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడే వరకు పర్యవేక్షణ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కస్తూరిబా విద్యాలయంలో జరిగిన ఘటన బాధాకరమన్నారు. విద్యార్థినుల ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు వైద్యులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన చికిత్స అందించడంతో పాటు వైద్యుల సూచనల మేరకు మందులు, పోషకాహారం అందించాలని ఆదేశించారు. ఇప్పటికే విద్యాలయాన్ని పరిశీలించి విద్యార్థినుల చదువు, ఆరోగ్యం, వసతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థినుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు కొనసాగుతాయని కలెక్టర్ కె. హైమావతి తెలిపారు.

