చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
బయోమెట్రిక్ హాజరుపై ఆరా.. సిబ్బంది సమయపాలనపై పరిశీలన
పారిశుధ్యం, చెత్త సేకరణ, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష
అర్జీదారులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ కె. హైమావతి
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది సమయపాలనపై ఆరా తీసిన కలెక్టర్.. బయోమెట్రిక్ హాజరు నమోదును పరిశీలించారు. కార్యాలయంలో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ తీరును తనిఖీ చేశారు. మున్సిపాలిటీలో రోజువారీగా చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇంటింటి చెత్త సేకరణ, ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు, చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ తదితర పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని, పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా పరిశీలించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

