జీవో 97 రద్దు చేయాలి
పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా, ర్యాలీ
కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ/శక్తి పరిధిలోకి విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేర్యాలలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా, భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు ఒగ్గు శ్రీశైలం మాట్లాడుతూ జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల సర్టిఫికెట్ల విలువ, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను స్వతంత్రంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవో 97ను వెంటనే రద్దు చేయకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

