జీవో 97ను వెంటనే రద్దు చేయాలి
* పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ నిరసన
కాకతీయ,చేర్యాల: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాలిటెక్నిక్ కళాశాలల బంద్ కార్యక్రమంలో భాగంగా చేర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. తరగతులను బహిష్కరించి కళాశాల ముందు
జీవో 97 పత్రాలను దహనం చేసి బంద్‌ను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలని అన్నారు. జీవో 97 అమలు వల్ల విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు, ఆధునిక సాంకేతిక పరికరాల కొరత వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు.
కావున ప్రభుత్వం జీవో 97ను తక్షణమే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఏబీవీపీ ఇన్‌చార్జ్ సాయి, మేఘన, రమేష్తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

