రోడ్లా.. చెరువులా..?
డ్రైనేజీ లేక భాగ్యనగర్ తండాలో జలదిగ్బంధం
కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు ఇళ్లలోకి చేరి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గుగులోత్ అంజి ఇంటి వద్ద ప్రతి వర్షానికి నీరు చేరుతుండటంతో వృద్ధ దంపతులు రాత్రిళ్లు నిద్ర లేక జాగారం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలోత్ రాంబాబు ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సమస్యను పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారీ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండగా, ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వెంటనే పక్కా డ్రైనేజీ నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.

