సైబర్ మోసాలపై అప్రమత్తతే రక్షణ : ఎస్పీ
కాకతీయ, ములుగు ప్రతినిధి: డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ములుగులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులకు సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. కేవైసీ, డీప్‌ఫేక్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ లింకులు, పెట్టుబడి పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ నలువాల రవీందర్, సీఐలు, ఎస్‌ఐలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

