కారేపల్లిలో కదం తొక్కిన కార్మికులు
నేతల అరెస్టులతో ఉద్రిక్తత.. జైల్భరోతో హోరెత్తిన కారేపల్లి
కాకతీయ, కారేపల్లి: కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం కారేపల్లిలో నిర్వహించిన జైల్భరో కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో, మానవహారం చేపట్టారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కార్మికులు వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం పలువురు నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఉపాధి హామీ చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థను పరిరక్షించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కే. నరేంద్ర, ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు, కేశగాని ఉపేందర్, యనమనగండ్ల రవి, సురభాక ధనమ్మ, కొండబోయిన ఉమావతి తదితరులు పాల్గొన్నారు.

