వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్ వేగం పెంచాలి
పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై స్పష్టత ఇవ్వాలి
స్థానిక యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించాలి
మహిళలు, ఎస్సీలు, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం
పార్క్ అభివృద్ధి పురోగతిపై లోక్‌సభలో ప్రశ్న
వరంగల్‌ను జాతీయ జౌళి హబ్‌గా తీర్చిదిద్దాలి
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
కాకతీయ,తెలంగాణ బ్యూరో : వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో ప్రకటించిన లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన వేగంగా పెరగాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య అన్నారు. స్థానిక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్ అమలు పురోగతిపై డా. కడియం కావ్య లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి ప్రారంభం, ఉద్యోగాల కల్పనపై వివరాలు వెల్లడించాలని కోరారు. ముఖ్యంగా స్థానిక యువత, మహిళలు, ఎస్సీలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఎన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా సమాధానమిస్తూ దేశవ్యాప్తంగా 7 పీఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందులో తెలంగాణలోని వరంగల్‌ను ఒక ప్రాంతంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వరంగల్ పార్క్‌ను బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీలో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పెట్టుబడులు, ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి
కేంద్రం సమాధానంపై డా. కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్ పీఎం మిత్ర పార్క్ కేవలం పారిశ్రామిక ప్రాజెక్టుగా కాకుండా తెలంగాణలోనే అతిపెద్ద ఉపాధి, పెట్టుబడుల కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. పార్క్‌లో మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. వరంగల్‌ను జాతీయ స్థాయి జౌళి హబ్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

