ప్రభుత్వ సాయంతో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసుకోవాలి
కాకతీయ, మయూరి సెంటర్: ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. బుధవారం ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పునాది, గోడలు, స్లాబ్, తుదిదశ పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని సూచించారు. నిర్దిష్ట గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ జయచంద్ర, ఈఈ జగ్గారావు, ఏఈలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

