ఖమ్మం అభివృద్ధికి తుమ్మలే బ్రాండ్ అంబాసిడర్
సమగ్రాభివృద్ధి, సంక్షేమమే మంత్రి ధ్యేయం
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు యర్రం బాలగంగాధర్ తిలక్
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, నగరానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నారని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం త్రీటౌన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్ అన్నారు. ఖమ్మం నగరంలోని జూబ్లీ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 1177 మంది లబ్ధిదారులకు రూ.1,78,36,532, ఎల్‌ఓసీల ద్వారా 213 మందికి రూ.4,71,30,000, సీఎంఆర్‌ఎఫ్ కింద 2365 మందికి రూ.7,27,90,000 అందించామని తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
నగర రూపురేఖలు మారేలా పనులు
రూ.249 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, రూ.700 కోట్లతో మున్నేరు వరద రక్షణ గోడలు, రూ.220 కోట్లతో వరద నీటి మళ్లింపు పనులు చేపట్టినట్లు తెలిపారు. మున్నేరుపై రూ.180 కోట్లతో కేబుల్ వంతెన నిర్మాణం, రూ.150 కోట్లతో వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ, ఖిల్లాకు రూ.15 కోట్లతో రోప్‌వే ఏర్పాటు జరుగుతోందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్ నిధులతో రూ.220 కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల పనులు, క్రీడా ప్రాంగణాలు, జిల్లా కోర్టు, వెలుగుమట్లలో 500 ఎకరాల అర్బన్ పార్కు, శిల్పారామం తదితర అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తిలక్ తెలిపారు. సమావేశంలో తల్లాడ రమేష్, కొప్పర సరిత ఉపేందర్, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, గజ్జల లక్ష్మీ వెంకన్న, దొన్వాన్ సరస్వతి రవి, తూములూరి లక్ష్మీనరసింహారావు, కలిమెల భద్రయ్య, భోజడ్ల సత్యనారాయణ, యాసబోయిన శ్రీశైలం, పత్తికొండ శ్రీనివాసులు, గెల్లా కృష్ణవేణి, బాలిని శ్రీనివాస్, దేవర వెంకన్న, ఎస్‌కే జాకీర్, గుడ్ల శ్రీనివాసరావు, తోళ్ల కుటుంబరావు, బాణాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

