టీజీఎండీసీ పీవోల బదిలీలు
ఇసుక నిర్వహణపై పర్యవేక్షణకు జిల్లాల పునర్విభజన
పలువురికి అదనపు బాధ్యతలు.. మరికొందరికి కొత్త జిల్లాలు
శంకర్‌నాయక్, బి.రాజు మాతృసంస్థలకు
వికారాబాద్ బాధ్యతల నుంచి రాకేష్‌కుమార్ రిలీవ్
తక్షణమే కొత్త బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక నిర్వహణ కార్యకలాపాలపై సమర్థవంతమైన పర్యవేక్షణ, కార్యాచరణ నియంత్రణ కోసం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు అధికారుల జిల్లా బాధ్యతలను పునర్విభజించింది. పలువురు ప్రాజెక్టు అధికారుల పరిధిలో మార్పులు చేస్తూ, కొందరికి అదనపు జిల్లాల బాధ్యతలు అప్పగించింది. మరికొందరికి కొత్త జిల్లాలను కేటాయించగా, ఇద్దరు అధికారులను వారి మాతృసంస్థలకు తిరిగి పంపించింది. ఈ మేరకు టీజీఎండీసీ ఈ నెల 13న కార్యాలయ ఉత్తర్వులు జారీ చేసింది. మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ములుగు, హనుమకొండ, వరంగల్ జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్న వి.వెంకటేశ్వర్లుకు ఎలాంటి మార్పు చేయలేదు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల బాధ్యతలు చూస్తున్న పి.శ్రీనివాస్‌కు అదనంగా మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా బాధ్యతను విష్ణువర్ధన్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల బాధ్యతలను హెచ్.వినయ్‌కుమార్ కొనసాగించనున్నారు. మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్న రాకేష్‌కుమార్ పరిధి నుంచి వికారాబాద్ జిల్లాను తొలగించారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్న జి.శంకర్‌నాయక్‌ను మాతృసంస్థకు తిరిగి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యతను దశరథంకు కేటాయించారు.
జయశంకర్ భూపాలపల్లి బాధ్యతలు మార్పు
జయశంకర్ భూపాలపల్లి బాధ్యతలు నిర్వహిస్తున్న పి.రామకృష్ణకు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలను కేటాయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాధ్యతను డి.రవీందర్‌కు అప్పగించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్‌కుమార్‌కు వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలను కేటాయించారు. మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్న మదన్మోహన్గౌడ్కు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలను అప్పగించారు.
వెంటనే కొత్త బాధ్యతలు చేపట్టాలి
కొత్తగా జిల్లాల బాధ్యతలు పొందిన అధికారులు తమ ప్రస్తుత బాధ్యతల నుంచి వెంటనే రిలీవ్ అయి, కేటాయించిన జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించాలని టీజీఎండీసీ ఆదేశించింది. కొత్తగా నియమితులైన అధికారులు కూడా ఎలాంటి జాప్యం లేకుండా బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది. జి.శంకర్‌నాయక్, బి.రాజులను జిల్లా బాధ్యతల నుంచి రిలీవ్ చేసి వారి మాతృసంస్థలకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రికార్డుల అప్పగింతపై స్పష్టమైన ఆదేశాలు
బాధ్యతల అప్పగింతలో భాగంగా ఆయా జిల్లాలకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, ఫైళ్లు, ఇసుక రీచ్‌లు, స్టాక్‌యార్డులు, వాహనాలు, పరికరాలు, పెండింగ్ కేసులు, ఆర్థిక వ్యవహారాలు, భద్రతా ఏర్పాట్లు, సమాచార సాంకేతిక వ్యవస్థలు, సీసీటీవీ వ్యవస్థలు, ఇతర ఆస్తులు, సమాచారాన్ని పూర్తిగా అప్పగించాలని ఆదేశించింది. రిలీవింగ్, బాధ్యతల స్వీకరణకు సంబంధించిన నివేదికలను సంతకాలతో ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని పేర్కొంది. ఈ మార్పులు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమల్లో ఉంటాయని టీజీఎండీసీ స్పష్టం చేసింది. ఇసుక నిర్వహణలో జిల్లా స్థాయిలో పర్యవేక్షణను మరింత సమర్థవంతం చేయడం, పరిపాలనా సౌలభ్యం, కార్యకలాపాలపై నియంత్రణను పెంచడం లక్ష్యంగా ఈ పునర్విభజన చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

