రాజన్న క్షేత్రంలో గోవధ దందానా?
అధికారులకు విహెచ్పీ ఫిర్యాదు
అనుమతుల్లేని బిర్యానీ సెంటర్లపై తనిఖీలు చేపట్టాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
ఎంపీడీవో బింగి కీర్తనకు వినతిపత్రం సమర్పించిన
వీహెచ్పీ జిల్లా కార్యదర్శి గడప కిషోర్రావు
కాకతీయ, వేములవాడ : వేములవాడ పట్టణంలోని గోవధశాలలు, అక్రమ పశువధ కేంద్రాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బిర్యానీ సెంటర్లు, ఇతర మాంస విక్రయ కేంద్రాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గడప కిషోర్రావు కోరారు. ఈ మేరకు వేములవాడ అర్బన్ మండల ఎంపీడీవో బింగి కీర్తనకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి కోడె మొక్కులు చెల్లించే ప్రత్యేక సంప్రదాయం ఉందని కిషోర్రావు తెలిపారు. ఈ నేపథ్యంలో గోవులు, కోడెలను భక్తులు పవిత్రంగా భావిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతంలో పశువైద్యాధికారి ధ్రువపత్రాలు, సంబంధిత అనుమతులు లేకుండా పశువధ జరుగుతున్నట్లయితే అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించాలని కోరారు.
అనుమతుల్లేని కేంద్రాలపై నిఘా
పట్టణంలో అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కళ్యాణి బిర్యానీ సెంటర్లు, ఇతర మాంస విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేయాలని కిషోర్రావు విజ్ఞప్తి చేశారు. పశువధకు సంబంధించిన అనుమతులు, పశువైద్య ధ్రువపత్రాలు, ఇతర నిబంధనలను పరిశీలించి ఉల్లంఘనలు గుర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.వేములవాడ రాజన్న ఆలయానికి దేశ, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని, పట్టణానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కిషోర్రావు కోరారు. భక్తులు, పట్టణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అనుమానాస్పద పశువధ, మాంస విక్రయ కేంద్రాలపై సమగ్రంగా విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

